: ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే రూ. 6.7 కోట్లు కొల్లగొట్టిన ఖైదీ!
భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన 'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే అమెరికాలో మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.7 కోట్లు) వసూలు చేసింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్, హాస్య నటుడు వెన్నెల కిషోర్ లు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉందన్న రివ్యూలు వస్తుండటంతో, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో శుక్రవారం నుంచి మరిన్ని షోలు వేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోందని చెబుతూ, హీరోయిన్ కాజల్ థియేటర్ లో అభిమానులు సందడి చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసుకుంది. చిత్రం సూపర్ హిట్ అయిందని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు.