: హైదరాబాద్‌లో ప్రైవేటు జూ!.. అక్రమంగా వన్యప్రాణుల బందీ.. ఆపై స్మగ్లింగ్!
నెహ్రూ జూలాజికల్ పార్క్.. హైదరాబాద్‌లో ఉన్నది ఇదొక్కటే. అందరికీ తెలిసింది దీని గురించే. తెలియని విషయం ఏంటంటే పాతబస్తీలో మరో ప్రైవేటు జూ ఉందని. అయితే ఇక్కడేమీ జంతువుల ప్రదర్శన ఉండదు. వాటిని పెంచి స్మగ్లింగ్ చేస్తారంతే. ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన ఓ ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు అవాక్కయ్యారు.
అరుదైన, అంతరించిపోతున్న కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లలను పట్టి తెచ్చేందుకు హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అరీఫ్ మరో నలుగురితో కలిసి కొన్ని రోజుల క్రితం బీహార్ వెళ్లాడు. అక్కడ ఈ జాతులకు చెందిన ఐదు పిల్లులను పట్టుకున్నారు. ఇనుప బోనులో వాటిని భద్రపరిచి సోమవారం వారు తిరిగి ఉత్తరప్రదేశ్ మీదుగా హైదరాబాద్ వస్తుండగా ఆ రాష్ట్ర అటవీ అధికారులకు చిక్కారు. మీర్జాపూర్ సమీపంలో వీరిని అడ్డుకున్న పోలీసులు తనిఖీ చేయగా వారి వాహనంలో కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన ఐదు పిల్లులు పట్టుబడ్డాయి. అరిఫ్ సహా మరో ఇద్దరిని అధికారులు పట్టుకోగా, మిగిలిన వారు తప్పించుకున్నారు.
అధికారులకు పట్టుబడిన నిందితులు తొలుత తాము హైదరాబాద్ జూ సిబ్బందిమంటూ తప్పించుకోజూసినా పత్రాలు చూపించమనేసరికి వారి అసలు రంగు బయటపడింది. పాతబస్తీలో అనధికారికంగా కొనసాగుతున్న జూలో పెంచుకునేందుకే వీటిని తరలిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. అంతరించి పోయాయని భావిస్తున్న తరుణంలో ఈ జాతి పిల్లులు దొరకడం ఆనందంగా ఉందని, నిందితులు వీటిని ఎలా, ఎక్కడ పట్టుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్టు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుకున్న వన్యప్రాణులను తొలుత హైదరాబాద్, బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లలో కొంతకాలం పెంచి తర్వాత వాటిని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. నిందితులు పట్టుకున్న కరకల్ క్యాట్స్ దేశవ్యాప్తంగా మొత్తం 200 ఉన్నట్టు అంచనా.