: కాంగ్రెస్ మీద ప్రజలకున్న ఆగ్రహమే నన్ను మళ్లీ సినిమాల్లో నటించేలా చేసింది: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారని చిరంజీవి చెప్పారు. 150వ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ నటి రోజా చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడిన స్తబ్ధత తాను సినీ రంగపునఃప్రవేశం చేసేందుకు ఉపయోగపడిందని అన్నారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారు.
వెంటనే రోజా 'ఇది కేవలం అభిమానుల కోరిక మాత్రమే కాదని, బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ గారు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారూ కూడా కోరుకున్నా'రని అన్నారు. ఈ సినిమా ప్రత్యేక షో సల్మాన్ తదితరుల కోసం ముంబైలో వెయ్యాలని రామ్ చరణ్ నిర్ణయించగానే, అమితాబ్ ను పిలవాలని అనుకున్నానని చిరంజీవి అన్నారు. ఆయన తన 150వ సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తానని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఆయన చెప్పారు.
ఆయన సినీ నటులకు లైట్ హౌస్ లాంటి వ్యక్తి అని ఆయన చెప్పారు. తనకు ఆయన దైవంలా కనిపిస్తారని ఆయన అమితాన్ ను ఉద్దేశించి అన్నారు. తనలా ఎవరైనా సరే గొప్ప భవిష్యత్ ను తయారు చేసుకోవచ్చని భరోసా ఇచ్చే గొప్ప మనిషి ఆయన అని అన్నారు. అమితాబ్ సినీ పరిశ్రమలో చాలా మందికి ఆదర్శమని ఆయన తెలిపారు.
ఇక పదేళ్ల విరామం తరువాత అభిమానులను అలరించేందుకు మంచి కథ కావాలని ఎదురు చూశానని, స్టాలిన్ సినిమా చేస్తున్నప్పుడు మురుగదాస్ ఈ సినిమా కథ గురించి జిస్ట్ చెప్పాడని చిరంజీవి అన్నారు. ఆ తరువాత రాజకీయాలతో బిజీగా మారడంతో ఆ సినిమా తమిళ్ లో విజయ్ తో తీశారని ఆయన తెలిపారు. అదే సినిమాలో తాను నటించడం కాకతాళీయమైనా, అద్భుతమైన కథ దొరికిందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో రైతుల భూములను కార్పొరేట్ అవసరాల పేరుతో కబ్జా చేయడంపై మంచి సందేశం ఉందని ఆయన అన్నారు.