: తొలి క్యాష్ లెస్ పెళ్లి జార్ఖండ్ లో జరిగింది...ఎలాగంటే!
అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరుపడ్డ జార్ఖండ్ లో అత్యంత వెనుకబడిన మారుమూల గ్రామంలో తొలి క్యాష్ లెస్ వివాహం జరగడం ఆసక్తి రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే...తూర్పుసింగ్ బమ్ జిల్లాలోని బడియా గ్రామానికి చెందిన సుభాష్ నాయక్ (30)కు పశ్చిమ సింగ్ బమ్ జిల్లాలోని ఇతిహాస గ్రామానికి చెందిన సునీత (20)తో వివాహం జరిగింది. ఈ వివాహంలో పూజారి దక్షిణ, డ్రెస్సింగ్, కూరగాయలు, టెంట్ హౌస్, ఆఖరుకి బంధుమిత్రుల చదివింపులు కూడా కరెన్సీ నోటు వినియోగించకుండా ఆన్ లైన్, ఈపేమెంట్ (ఎలక్ట్రానిక్), పేటిఎం వంటి పేమెంట్ల ద్వారా పూర్తి చేశారు. వాస్తవానికి బడియా గ్రామం పూర్తిగా వెనుకబడిన గ్రామం, ఈ గ్రామానికి ఎలాంటి సౌకర్యం లేదు. అయితే ఓ రోజు ఢిల్లీలోని ఓ కూడలి వద్ద భిక్షగాడు స్వైపింగ్ మెషీన్ పట్టుకుని అడుక్కోవడాన్ని మీడియాలో చూసిన గణేష్ కుమార్, తమ గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా మార్చాలని భావించాడు.
దీంతో, ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న సంజయ్ కుమార్ ను కలిశారు. ఆయన సహకారంతో ఈ వివాహ తంతు కరెన్సీ రహితంగా జరిగింది. వివాహానికి ముందు వరకు సుభాష్ కు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం విశేషం. దీంతో అప్పటికప్పుడు సంజయ్ కుమార్ చొరవతో బ్యాంకు అధికారులు మూడు రోజులపాటు గ్రామంలో బసచేసి, ఆన్ లైన్ సేవలు ఎలా ఉపయోగించాలో వివరించారు. గ్రామీణుల సందేహాలు తీర్చారు. దీంతో గ్రామం మొత్తం ఈపేమెంట్ ఆప్షన్ ను ఉపయోగించి వివాహం పూర్తి చేశాయి. వివాహం ముగిసిన అనంతరం భార్యాభర్తలిద్దరి చేత అధికారులు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించి, ఏటీఎం కార్డులు అందజేశారు. వరుడి నివాసంలో బాత్రూం లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ చొరవతో దాని నిర్మాణం 11 గంటల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నగదు చెల్లింపులన్నీ ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం విశేషం.