: ఆ జవాను ఒక మందుబాబు... 'మిలట్రీ భోజనం'పై వైరల్ అయిన వీడియోపై బీఎస్ఎఫ్ వివరణ!
తమకు వడ్డించిన భోజనాన్ని చూపిస్తూ, సరిపడినంత ఆహారం ఇవ్వడం లేదని, 11 గంటలు నిలబడి పనిచేయాల్సి వస్తోందని, భోజనంలో నాణ్యత ఉండటం లేదని, సైనికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ ఓ జవాను పోస్టు చేసిన వీడియో వైరల్ కాగా, గంటల వ్యవధిలోనే బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) స్పందించింది. ఆ వీడియోలో మాట్లాడిన జవాను పేరు తేజ్ బహదూర్ యాదవ్ (29) అని, అతనో తాగుబోతని, తరచూ నిబంధనలు మీరుతుండే అతనికి, విధుల్లో చేరినప్పటి నుంచి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చామని ఓ ప్రకటనలో తెలిపింది.
సీమా సురక్షా బల్ లో జవానుగా ఉన్న అతను, వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వహిస్తుంటాడని తెలిపింది. పై అధికారులతో గొడవలు పడుతుండటం అతనికి అలవాటని పేర్కొంది. బీఎస్ఎఫ్ జవాన్లకు ఇస్తున్న ఆహారంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని, వారికి సరిపడినంత ఆహారాన్ని ఇవ్వట్లేదనడం అవాస్తవమని పేర్కొంది. కాగా, ఈ వీడియోపై విచారణ జరపాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.