: కొడుకు కోసం మనవరాళ్లతో ములాయం రాయబారం!


పార్టీలో పుట్టిన సంక్షోభం లక్నోలోని సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసాల మధ్య అడ్డుగోడలను పెంచితే, ఇద్దరికి మాత్రం అటువంటిదేమీ లేదు సరికదా... సంక్షోభ గోడ వారిని ఎంతమాత్రమూ నిలువరించలేక పోతోంది. వారే ములాయం మనవరాళ్లు, అఖిలేష్ యాదవ్ కుమార్తెలు అదితి (15), టీనా (10). చిన్నప్పటి నుంచి వీరిద్దరూ తండ్రి కన్నా, తాత వద్దే అధికంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీలో గొడవలు రెండు ఇళ్ల మధ్యా వీరి రాకపోకలకు ఎంతమాత్రం అడ్డుగా నిలవలేకపోయాయి.

వీరిద్దరూ సునాయాసంగా తమ తాతయ్యను కలిసేందుకు వెళ్లి వస్తున్నారు. ఇక కొడుకుతో రాయబారాలకు, మాటలు కలిపేందుకు ములాయం వీరిని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన మనవరాలు టీనాతో ఆడుకుంటూ, "మీ నాన్న చాలా మొండోడు" అని ములాయం వ్యాఖ్యానించగా, ఆ పాప, ఇంటికి వచ్చి తాతయ్య చెప్పింది చెప్పినట్టు తండ్రికి చేర్చింది. దీన్ని విన్న అఖిలేష్ సైతం నవ్వుతూ "అవును, నేను మొండి వాడినే" అన్నట్టు తెలిసింది.

యూపీలో మరో నెలరోజుల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, సాధ్యమైనంత త్వరగా తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలు సమసిపోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక, తమ పార్టీకి అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రని ములాయం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఎలక్షన్ కమిషన్ ను కలసి తిరిగి లక్నో వస్తున్న వేళ, ములాయంకు స్వాగతం పలకాలని నిర్ణయించుకున్న అఖిలేష్, అదే విమానంలో అమర్ సింగ్ ఉన్నారని తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించారు. ఈ ఘటన గతవారంలో జరుగగా, ఆ విమానంలో అమర్ సింగ్ లేకుంటే, తండ్రీ కొడుకులు ఈపాటికే కలసిపోయి ఉండేవారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News