: ధోనీ కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ నేడే!
ఇండియాకు అత్యద్భుత విజయాలు అందించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, నేడు తన క్రికెట్ కెరీర్ లో కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ఇంగ్లండ్ - భారత్ ఏ మధ్య తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ముంబైలో సాగనుండగా, అందరి కళ్లూ జట్టులో సభ్యులుగా ఉన్న యువరాజ్ సింగ్, నెహ్రాలపై ఉంటాయనడంలో సందేహం లేదు.
2011లో ధోనీ వరల్డ్ కప్ గెలిచిన వేళ, వీరిద్దరూ జట్టులో సభ్యులన్న సంగతి తెలిసిందే. దేశవాళీ టోర్నీలలో సత్తా చాటి, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు జట్టులోకి వచ్చిన యువరాజ్, ఈ మ్యాచ్ లో సత్తా చాటి, తిరిగి ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటంతో, పెద్ద మ్యాచ్ కానప్పటికీ, ఇంగ్లండ్ తో ఈ పోరు రసవత్తరంగా మారింది. ఇక ఇంగ్లండ్ తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కి అజింక్య రహానే నేతృత్వం వహించనుండటంతో, ఇదే ధోనీకి కెప్టెన్ గా చివరి మ్యాచ్ కానుంది.