: ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం.. ప్రియుడు, భార్యను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు!
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలన్న భార్య, అతడి ప్రియుడి ఆటలు సాగలేదు. బాధితుడి కేకలతో అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు నిందితులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వలసపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఏడాది క్రితం పనిలో ఉండగా బండలు మీదపడడంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అప్పటికే నిమ్మనపల్లె మండలంలోని దేవళం కరపల్లెకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాధితుడి భార్య.. భర్తను పట్టించుకోవడం పూర్తిగా మానేసింది.
దీంతో బాధితుడు అదే గ్రామంలో ఉన్న తన సోదరి ఇంట్లో ఉంటూ కాలికి చికిత్స చేయించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి అతడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోకి ప్రవేశించిన భార్య నిద్రిస్తున్న భర్త ముఖంపై తలగడ ఉంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పారిపోతున్న భార్య, ఆమె ప్రియుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకుని చెట్టుకు కట్టేసిన వారిని విడిపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.