: ముద్రగడా.. కాపులోకం అసహ్యించుకుంటోంది.. జగన్ ముసుగు తీసేయ్..!: కాపు ఉద్యమనేతకు ఏపీ మంత్రుల పిలుపు
''ముద్రగడా.. మీ తీరుచూసి కాపు లోకం అసహ్యించుకుంటోంది..ఇప్పటికైనా మీరు కప్పుకున్న జగన్ ముసుగును తొలగించండి''.. అంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి ఏపీ మంత్రులు హితవు పలికారు. మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, మృణాళిని కలిసి ముద్రగడకు సంయుక్తంగా బహిరంగ లేఖ రాశారు. కాపు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నేతకు లబ్ధి చేకూర్చడానికి చేస్తున్న ప్రయత్నం ద్వారా ఉద్యమం పక్కదారి పడుతోందని లేఖలో విమర్శించారు.
ఉద్యమం కాస్తా వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే దారిలో వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో జరుపుతున్న భేటీల వల్ల కాపు సోదరులకు మేలు కన్నా కీడు జరిగే అవకాశాలున్నాయన్నారు. కాబట్టి ఇప్పటికైనా వేసుకున్న జగన్ ముసుగును తొలగించాలని కోరారు. 2004లో ఎన్నికల సమయంలో కాపులను బీసీలలో చేరుస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయకపోయినా నోరు మెదపని మీరు ఇప్పుడు వైసీపీ నేత జగన్ చేతిలో శిఖండిగా మారారని లేఖలో తీవ్ర స్థాయిలో విమర్శించారు.