: బాలీవుడ్ నటుడు ఓంపురి మృతి వెనక మోదీ హస్తం ఉందంటూ పాక్ చానల్ హాస్యాస్పద కథనం
ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురిది సహజ మరణం కాదా? ఆయనను హత్య చేశారా? అంటే అవుననే అంటోంది పాకిస్థాన్‌కు చెందిన బోల్‌టీవీ అనే చానల్. ఓంపురి హత్య వెనక మోదీ హస్తం ఉందని ఆరోపించింది. పాకిస్థాన్ కళాకారులకు ఆయన మద్దతు పలకడంతో జీర్ణించుకోలేని మోదీ ఓంపురిని చంపించారంటూ ఒక హాస్యాస్పద కథనాన్ని ప్రసారం చేసింది.
ఓంపురి మృతి వెనక ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హస్తముందని బోల్ టీవీ ప్రసారం చేసిన 'ఐసీ నహీ చలేగా' అనే హాస్యస్పద కథనంలో పేర్కొంది. తన వద్దకు రావాల్సిందిగా దోవల్ ఇటీవల ఓంపురికి కబురు పెట్టారని పేర్కొన్న చానల్ ఆయన ఇంటికి రాగానే పీకలదాకా మద్యం తాగించారని కథనంలో పేర్కొంది. తర్వాత అక్కడే ఆయన దుస్తులు మొత్తం ఊడదీసి చితక్కొట్టారని వివరించింది.
ఉరీ అమర జవాను నితిన్ యాదవ్ గ్రామానికి ఓంపురిని తీసుకెళ్లి సైనికులపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించారని పేర్కొంది. వారు కొట్టిన దెబ్బలకు తాళలేకే ఓంపురి మృతి చెందారని సదరు చానల్ పేర్కొంది. అంతేకాదు, ఈ తతంగాన్ని తాను దగ్గరుండి మరీ చూసినట్టు ఆ టీవీ ఛానెల్ పేర్కొంది. ఇప్పుడు మోదీ లిస్టులో పాకిస్థాన్ నటుడు ఫవాద్‌ఖాన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ఉన్నారని పేర్కొన్న చానల్ వారు ముస్లింలు కావడమే ఇందుకు కారణమని వివరించింది.