: మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదు...కాంగ్రెస్ కి అవకాశాలు ఉన్నాయి: చిరంజీవి
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవుతుందని ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, డీమానిటైజేషన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేసిన పనితో దేశంలో నల్లధనం లేదని బయటపడిందని ఆయన చెప్పారు. 15 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వినియోగంలో ఉందని ఆర్బీఐ ప్రకటించిందని, అందులో 14 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం తిరిగి ఆర్బీఐకి చేరిందని కూడా తెలిపిందని ఆయన గుర్తుచేశారు. అలాంటప్పుడు నల్లధనం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ లెక్కన దేశంలో నల్లధనం అన్నదే లేదని ఆయన తెలిపారు. నల్లధనం ఉందో లేదో తెలుసుకోకుండానే పెద్దనోట్లను రద్దు చేశారని, దీని కారణంగా దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని ఆయన తెలిపారు. వారంతా మౌనంగా ఊరుకుంటారా? అంతకంతా కసితీర్చుకుంటారని, అయితే ఆ రోజు కోసం ఎదురు చూడాలని ఆయన తెలిపారు. దీనిని వినియోగించుకుంటే కాంగ్రెస్ కి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు.