: మా స్కూల్ ఛైర్మన్ మినిస్టర్ తెలుసా?... మంత్రి నారాయణను ఆశ్చర్యంలో ముంచెత్తిన చిన్నారి!
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గర్వించే క్షణాలు నెల్లూరులో చోటుచేసుకున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆయన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ చలాకీగా ఉన్న చిన్నారి ఆయనను ఆకర్షించింది. దీంతో వెంటనే ఆ పాపను పిలిచి నీ పేరేంటి? అని అడిగారు. దానికా చిన్నారి 'శ్రేయాంషి' అని చెప్పింది.
'ఏం చదువుతున్నావ'నగానే '4వ తరగతి చదువుతున్నా'నని చెప్పింది. 'అవునా!' అన్న ఆయన 'ఏ స్కూల్ లో?' అని అడిగారు. 'మినీ బైపాస్ రోడ్డులో ఉన్న నారాయణ హైస్కూల్'లో అని చెప్పింది. అంతటితో ఆగని ఆ పాప, 'మా స్కూల్ ఛైర్మన్ మినిస్టర్ తెలుసా?' అని ఆయనను ప్రశ్నించింది. నాలుగేళ్ల పాప తన స్కూల్ ఛైర్మన్ మినిస్టర్ అని ఆనందంగా చెప్పగానే. అంతా నవ్వేశారు. ఆయన ఒకింత గర్వంగా నవ్వారు. ఇంతలో పక్కనున్నవారు 'ఆయనే మీ స్కూల్ ఛైర్మన్' అని చెప్పగా 'అవునా?' అంటూ పాప ఆశ్చర్యపోయింది.