: నన్ను వాళ్లు మోసం చేశారని ఇప్పటికీ ఆ సినిమాలు చూడలేదు: విద్యాబాలన్
సినిమా తీసే ముందు చెప్పిన కథకు, తెరకెక్కించిన కథకు పొంతన లేదని, ఆయా పాత్రల పరిధిని కూడా తగ్గించేశారనే వార్తలు అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాము. తమ పాత్రల పరిధిని తగ్గించేసినప్పుడు సదరు ఆర్టిస్ట్ ఎంతో కొంత ఫీలవకుండా ఉండరు. అటువంటి అనుభవమే బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు ఎదురైందట.
ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. ‘ఒక్కోసారి, మనకు చెప్పిన కథకు, ఆ సినిమా పూర్తయిన తర్వాత కథకు చాలా తేడా ఉంటుంది. మనకు కథ చెప్పినప్పుడు, మనం పోషించే పాత్రకు ప్రాధాన్యతతో పాటు ఎక్కువ నిడివి కూడా ఉంటుంది. కానీ, సినిమా పూర్తయ్యేసరికి మన పాత్ర పరిధి కుంచించుకుపోతుంది. ఇటువంటి పరిస్థితి ఒకసారి కాదు, రెండుమూడుసార్లు నాకు ఎదురైంది. థియేటర్ కు వెళ్లి సినిమా చూడగానే ఆశ్చర్యపోయి, సినిమా మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయాను. ఆయా సినిమాలకు సంబంధించిన వారు నన్ను మోసం చేయడంతో, ఆ సినిమాలను ఇప్పటికీ నేను చూడలేదు. అందుకే, ఆ చిత్రాల అనుభవంతో..స్క్రిప్టు పకడ్బందీగా లేని సినిమాలను ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను’ అని విద్యాబాలన్ చెప్పింది.