: ఆత్మహత్య చేసుకోవాలని గూగుల్ లో వెతికి... డీఐజీకి ఫోన్ చేసిన యువతి!
ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు ముఖం చాటేయడంతో తీవ్రమైన డిప్రషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన 24 ఏళ్ల యువతి, అందుకు మార్గాలను గూగుల్ లో వెతికి, ఆపై సూసైడ్ హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేసి డీఐజీతో మాట్లాడగా, ఆయన ఆమె మనసును మార్చారు. బరేలీలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాల్లోకి వెళితే, తన బాయ్ ఫ్రెండ్ కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో, ఆమెను దూరంగా పెట్టాడు. దీంతో షహరాన్ పూర్ కు 4 కిలోమీటర్ల దూరంలోని యమునా కాలువలో దూకి మరణించాలని భావించింది. మరింత సులువుగా మరణించేందుకు మార్గాన్వేషణ చేస్తూ, ఓ నంబరు చూసింది. ఆపై ఆ నంబరుకు కాల్ చేస్తే, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ జితేంద్ర కుమార్ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.
"జనవరి 3న నా పబ్లిక్ నంబరుకు కాల్ వచ్చింది. ఆమె చాలా అసహనంగా ఉంది. ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. అందుకోసం గూగుల్ లో వెతికానని చెప్పింది. ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోవాలని, ఒక్కసారి తనను వచ్చి కలవాలని చెప్పాను. ఆపై ఆమె వచ్చింది. తన కథను చెప్పింది. ఆమె మనసును మార్చడంలో విజయం సాధించాం" అని జితేంద్ర వెల్లడించారు. ఇటువంటి కేసులు తమకు నిత్యమూ వస్తుంటాయని, మామూలుగా అయితే, ఓ సంబంధం చెడిపోతే యువతులు వేధింపుల కేసులు పెడుతుంటారని, ఈమె మాత్రం తన స్నేహితుడిపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని అన్నారు. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు సదరు యువతి మాత్రం అందుబాటులో లేదు.