: చిలుకూరు బాలాజీకి ట్రంప్ కష్టాలు... తేల్చుకుంటామంటున్న హైదరాబాద్ టెక్కీలు!


తెలుగు రాష్ట్రాల్లోని వారికి, అందునా అమెరికా వంటి దేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి పరిచయం అక్కర్లేని దేవుడు చిలుకూరు బాలాజీ. ఆయన్నే వీసా బాలాజీ అని కూడా అంటారు. ఈ గుడిని సందర్శించి 11 సార్లు దేవుడికి ప్రదక్షణ చేసి, ఓ తులసి దళాన్ని దేవుడి పాదాల ముందు ఉంచితే, వీసా వస్తుందని నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు. వీసా వచ్చిన తరువాత తిరిగి దేవుడిని సందర్శించుకుని 108 సార్లు ప్రదక్షణ చేసి మొక్కు తీర్చుకోవాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే.

ఇక వడ్లమాని మధు (25), చిలకమర్రి రేవంత్ (29)లు సైతం తమ అమెరికా కలను నెరవేర్చుకునేందుకు వీసా బాలాజీని కొన్నేళ్ల క్రితం సందర్శించారు. ఇద్దరికీ స్టూడెంట్ వీసాలు రాగా, విడివిడిగా అమెరికాకు వెళ్లి, అక్కడ ప్రేమలో పడి ఒకటయ్యారు. ఇద్దరూ ఇప్పుడు సాఫ్ట్ వేర్ డెవలపర్లే. అక్కడే ఉద్యోగాలు కూడా చేశారు. వీసాల గడువు ముగిసిన తరువాత ఇక్కడికి వచ్చిన ఈ జంట, తమకు హెచ్-1బీ వీసాలు దక్కాలని మొక్కేందుకు మరోసారి చిలుకూరు వెళ్లారు.

సంవత్సరానికి దాదాపు లక్ష మంది విదేశీ ఉద్యోగులను అమెరికాకు ఆహ్వానించే హెచ్-1బీ వీసాల విధానాన్ని మరింత కఠినం చేయాలని ట్రంప్ భావిస్తుండటంపై ఒక వైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోవైపు నైపుణ్యముంటే ఉద్యోగాలకు కొదవేంటని ప్రశ్నిస్తున్నారు ఈ హైదరాబాదీ టెక్కీలు. అమెరికన్లకు అధికంగా ఉద్యోగాలు దక్కడమే లక్ష్యంగా ట్రంప్, ఆయన అటార్నీ జనరల్ జెఫ్ సీసన్స్ లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంకా అమలు కానప్పటికీ, హెచ్-1బీ వీసాల జారీ కఠినం కాక తప్పదని తెలుస్తోంది.

ఇక అమెరికాలో వేళ్లూనుకున్న కంపెనీల నుంచి పలువురు రాజకీయ నాయకులు, లాబీయిస్టుల వరకూ ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. "వాస్తవంగా చెప్పాలంటే, నాకు కొంత ఆందోళనగానే ఉంది" అంటూ ఇటీవలి వరకూ ఓర్లాండోలోని డెల్లాయిట్ శాఖలో పనిచేసి వచ్చిన మధు వ్యాఖ్యానించారు. "ఓ భారతీయ యువతిగా నా కర్మపై నాకు నమ్మకం ఉంది. వీసా వస్తుందనే భావిస్తున్నాను. రాకున్నా ఫర్వాలేదు. పని చేసేందుకు చాలా మంచి కంపెనీలు ఉన్నాయి" అని ఆమె అన్నారు.

హైదరాబాద్ లోనే మెరుగైన అవకాశాలను వెతుక్కోవచ్చని, వీసాలను తగ్గిస్తే, అమెరికానే నష్టపోతుందని ఆమె అభిప్రాయం. హెచ్-1బీ వీసాల కింద అమెరికన్లకు ఇవ్వాల్సిన వేతనంతో పోలిస్తే, తక్కువ వేతనాలతో నిపుణులైన, మరిన్ని గంటలు పనిచేసే విదేశీ ఉద్యోగులను కంపెనీలు అక్కడికి తీసుకెళ్తాయన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది భారతీయులు వర్క్ వీసాలపై అమెరికాకు వచ్చి ఆ కంపెనీల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా.

ఇక గత దశాబ్ద కాలంగా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఐటీ రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇక్కడి నుంచే అమెరికన్ క్లయింట్లకు సైతం సేవలందిస్తున్నాయి. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమేజాన్, డెల్, ఉబెర్ వంటి ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో ఆఫీసులను నిర్వహిస్తున్నాయి కూడా. 2000 సంవత్సరంతో పోలిస్తే, అమెరికా జారీ చేస్తున్న వీసాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలన్న కల, హెచ్-1బీ వీసా సాధించాలన్న కోరిక అంత తేలికగా తీరకపోవచ్చు. మరిక మన వీసాల బాలాజీ ఎంత మందిని ఆశీర్వదిస్తాడో వేచి చూడాలి.

మరోపక్క, అమెరికాకు వెళ్లి పని చేయాలన్న కోరిక ఇకపై అనవసరమన్నది తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయం. "ఉదాహరణకు యాపిల్ సంస్థనే తీసుకోండి. ఆ సంస్థ తన మ్యాప్ విభాగాన్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ పోటీ పడుతోంది. ఇక్కడ నిపుణులైన యువత అధికంగా లభిస్తుండటమే ఇందుకు కారణం. వీసాల విషయంలో ట్రంప్ సమతుల్య వ్యాపార వాతావరణం ఉండేలా చూస్తారనే భావిస్తున్నాను. ఒకవేళ అమెరికాకు వెళ్లలేకపోయినా, ఇక్కడ అపారంగా ఉన్న అవకాశాలను అందుకోవచ్చు" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News