: ఒక్క విధానాన్ని మార్చినా ప్రతీకారం తీర్చుకుంటాం!: ట్రంప్ కు చైనా తీవ్ర హెచ్చరిక


తాము అమలు చేస్తున్న విధానాలను ఏ ఒక్కటి మార్చాలని చూసినా ప్రతీకారం తీర్చుకు తీరుతామని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చైనా దేశం హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' సంపాదకీయం రాసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్ లో ఆగడాన్ని, అక్కడ రిపబ్లికన్ ప్రతినిధులను కలుసుకోవడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హోండురాస్, నికరాగ్వా, గాటెమాలా తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటనకు వెళ్లగా, చైనా పాలసీల ప్రకారం, తైవాన్ అధ్యక్షురాలిని అమెరికాలోని ఏ ప్రభుత్వ అధికారీ కలుసుకోరాదు. వాషింగ్టన్ కు ఆమె రాకుండా చూసుకోవాలని చైనా హెచ్చరించింది.

చైనాతో అమెరికాకు ఉన్న సంబంధాలు నిలవాలన్నా, అమెరికాకు తగిన గౌరవం ఇవ్వాలన్నా ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను పాటించాలని కోరింది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, సెనెటర్ టెడ్ క్రూజ్ లను కలుసుకున్న సాయ్ చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో చైనా మండిపడింది. కాగా, గత నెలలో సాయ్ స్వయంగా ట్రంప్ తో మాట్లాడి, ఆయన విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపిన వేళ కూడా చైనా ఇలాగే స్పందించింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని చైనా దీర్ఘకాలంగా వాదిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్ ను ప్రత్యేక దేశంగా పరిగణించేందుకు ససేమిరా అంటున్న చైనా, ఆ దేశంపై ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోంది. ఇక చైనా వాదనపై అమెరికా మాట్లాడాలని, తమకు అండగా నిలవాలని తైవాన్ కోరుకుంటోంది.

  • Loading...

More Telugu News