: ఏపీ వ్యాప్తంగా చెక్‌పోస్టుల్లో ఏకకాలంలో సోదాలతో హడలెత్తిస్తున్న ఏసీబీ.. సొమ్ము స్వాధీనం, పలువురి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలకు దిగింది. సోమవారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు చెక్‌పోస్టుల్లో లెక్కకు రాని సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టుల్లో వసూళ్ల దందాపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, నెల్లూరు జిల్లా భీములవారిపాలెం, గుంటూరు జిల్లా పొందుగల వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు, చిత్తూరు జిల్లా లోని పలమనేరు, నరహరిపేట, అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం చెక్‌పోస్టుల్లో ఏకకాలంలో దాడులు చేశారు.
ఈ సందర్భంగా పొందుగల చెక్‌పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.22వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలమనేరులో రూ.33వేలు, నరహరిపేటలో రూ.51 వేలు స్వాధీనం చేసుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టులో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం చెక్‌పోస్టులో రూ.64 వేలు స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేశారు.