: నసీరుద్దీన్ షా ప్రాణాలు కాపాడిన ఓంపురి.. దుండగుడిని అడ్డుకుని చితకబాదిన వైనం.. ఆత్మకథలో పేర్కొన్న షా
రెండు రోజుల క్రితం కన్నుమూసిన బాలీవుడ్ నటుడు ఓంపురి నిజజీవితంలో హీరో అని మరో నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నారు. తనపై దాడిచేసిన దుండగుడిని పట్టుకుని చితకబాది తన ప్రాణాలు కాపాడాడని షా తన ఆత్మకథ 'అండ్ దెన్ వన్ డే' పుస్తకంలో పేర్కొన్నారు. గతంలో తన స్నేహితుడైన ఓ వ్యక్తి కత్తితో తనపై దాడిచేస్తే అతడిని అడ్డుకోవడమే కాకుండా రక్తమోడుతున్న తనను ఆస్పత్రికి తీసుకెళ్లి తన ప్రాణాలు కాపాడాడని పేర్కొన్నారు.
1977లో 'భూమిక' అనే సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఈ ఘటన జరిగినట్టు గుర్తుచేసుకున్నారు. ఆ రోజు తనకు బాగా గుర్తుందని, ముంబైలోని ఓ హోటల్ కు డిన్నర్ కోసం వెళ్లినప్పుడు తమ వెనకే జస్పాల్ అనే వ్యక్తి కూర్చున్నాడని పేర్కొన్నారు. ఓంపురి, తాను తింటూ మాట్లాడుకుంటుండగా జస్పాల్ ఒక్కసారిగా కత్తితో తనపై దాడిచేసి వీపులో పొడిచాడని తెలిపారు. తాను తేరుకుని చూసే లోపే ఓంపురి దుండగుడిపై ఒక్కసారిగా లంఘించి అతడిని పట్టుకున్నాడని, మరోసారి దాడిచేయకుండా అడ్డుకున్నాడని పేర్కొన్నారు. హోటల్ సిబ్బంది సాయంతో ఓంపురి దుండగుడిని పట్టుకున్నాడని పుస్తకంలో వివరించారు. విషయం తెలిసి వచ్చిన పోలీసుల వాహనంలోనే రక్తమోడుతున్న తనను ఓంపురి ఆస్పత్రికి తరలించాడని పేర్కొన్నారు. ఆ రోజు ఓంపురి తనతోపాటు లేకుంటే తన ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవని ఆ పుస్తకంలో వివరించారు.