: సమయం లేదు మిత్రమా!.. ఈ నెల 12న విడుదలవుతోంది!: బాలకృష్ణ
‘సమయం లేదు మిత్రమా... ఈ నెల 12న విడుదలవుతోంది’ అని ప్రముఖ నటుడు బాలకృష్ణ తన సినిమా డైలాగును మిళితం చేసి అన్నారు. విశాఖపట్టణంలో ‘శాతకర్ణి’ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, బాలకృష్ణ మాట్లాడుతూ, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రశంసల వర్షం కురుస్తూనే ఉందని అన్నారు. ఈ చిత్ర నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ కష్టపడ్డారని, పంచభూతాలతో పాటు, దేవుడి దీవెనలు తమకు పుష్కలంగా ఉండటంతో దిగ్విజయంగా 79 రోజుల్లో చిత్ర నిర్మాణం జరిగిందన్నారు.
దర్శకుడు క్రిష్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తదితరులు అద్భుతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. బాలకృష్ణ తనదైన శైలిలో పద్యాలు, సామెతలు, శ్లోకాలను ఉదహరిస్తూ అభిమానులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర అతిథులను ఉత్సాహపరిచారు. తెలుగు, ఎన్టీఆర్ అనే పదాలు వింటే తన ఒళ్లు పులకించిపోతుందని బాలకృష్ణ పరవశించిపోయారు.