: నోట్ల రద్దు తర్వాత ఐటీ స్వాధీనం చేసుకున్న మొత్తం ఎంతంటే..
నల్ల ధనవంతుల, అవినీతిపరుల ఆట కట్టించే ఉద్దేశ్యంతో గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగి పలు చోట్ల సోదాలు నిర్వహించారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మర్నాటి నుంచి అంటే నవంబర్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఐటీ అధికారులు చేపట్టిన సోదాల్లో రూ.4,807 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వెల్లడించని లేదా లెక్కల్లో చూపని సొమ్మే. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.112 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉండగా, ఆ నోట్లలో అధిక శాతం రెండు వేల రూపాయల నోట్లే ఉన్నాయి. కాగా, నవంబర్ 9 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 1138 చోట్ల సోదాలు నిర్వహించామని, 5184 మందికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.