: యువతిపై మూడేళ్లుగా అఘాయిత్యం.. నిందితులు స్నేహితులే!
ఒక యువతిపై ముగ్గురు దుండగులు మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు, ముగ్గురు నిందితులు ఒకప్పుడు స్నేహంగా ఉండేవారు. 2013 ఏప్రిల్ లో ఒక సందర్భంలో మత్తు మందు కలిపిన డ్రింక్ ను ఆ యువతితో వారు తాగించడంతో, అపస్మారకస్థితికి వెళ్లింది.
అనంతరం, నిందితుల్లో ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను మరో ప్రాంతానికి తరలించి అక్కడి గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అక్కడి నుంచి ఏదో విధంగా బయటపడ్డ ఆ యువతి, కొన్నిరోజుల క్రితం ముంబైలోని పొవాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసును వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.