: రోడ్డు ప్రమాదంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లెక్చరర్ దుర్మరణం
కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీలో అకడమిక్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లాల్ బహుదూర్ శాస్త్రి మృతి చెందగా, ఇంగ్లీషు మెంటర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ నిన్న సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ నుంచి కడపకు వెళ్లారు. పనులు ముగించుకుని వస్తుండగా అర్థరాత్రి సమయంలో చీమలపెంట వద్ద వారి వాహనానికి పంది అడ్డంగా వచ్చింది. దీనిని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లాల్ బహుదూర్ శాస్త్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన స్వస్థలం ఒంగోలు. పులివెందులలో నివాసం ఉంటున్నారు. ఈయన విధుల్లో చేరిన మూడు రోజులకే ఈ సంఘటన జరగడంపై కళాశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుడు వెంకటరమణ స్వస్థలం పీలేరు.