: 'నా మైండ్ ను కంట్రోల్ చేస్తున్నారు...' అంటూ రెండు నెలల క్రితమే ఎఫ్బీఐకి ఫిర్యాదు చేసి, ఇప్పుడు కాల్పులు జరిపిన ఉగ్రవాది!
ఫోర్ట్ లౌడర్ డేల్ - హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, ఐదుగురి మృతికి కారణమై, ఆపై లొంగిపోయిన 25 ఏళ్ల ఎస్టిబాన్ శాంటియాగోను అధికారులు విచారిస్తున్నారు. తన మనస్సును ఎవరో కంట్రోల్ చేస్తున్నారని, ఇస్లామిక్ స్టేట్ వీడియోలు చూడాలని పురిగొల్పుతున్నారని రెండు నెలల క్రితం ఎస్టిబాన్, అలస్కా ఎఫ్బీఐ అధికారుల వద్దకు వెళ్లి ఆరోపించాడు. ఇరాక్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన ఎస్టిబాన్ తో పాటు ఈ కేసులో దాదాపు 100 మందిని విచారిస్తున్నామని పోలీసులు తెల్పారు. కాగా, అతను మతిస్థిమితం లేనివాడని ఎస్టిబాన్ కుటుంబ సభ్యులు చెబుతుండటం గమనార్హం. దాడుల వెనక అతని ఉద్దేశాన్ని కనిపెట్టే దిశగా విచారణ సాగుతోందని, ప్రస్తుతానికి ఉగ్రవాదమే అతని లక్ష్యమన్న కోణంలోనే ఆలోచిస్తున్నామని తెలిపారు.