: పిల్లా పాపలతో వచ్చి నానా అవస్థలూ పడుతున్నాం... టీటీడీ తప్పు చేస్తోంది: వాపోతున్న భక్తులు
ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని వచ్చిన భక్తజనం అగచాట్లు పడుతున్నారు. నేడు స్వామి వారి దర్శనం నిమిత్తం శనివారానికే తిరుమల చేరుకున్న అశేష భక్తజనాన్ని కంపార్టుమెంట్లలోకి అనుమతించగా, వారితోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. ఆపై సైతం తిరుమలకు భారీగా భక్తులు రావడంతో వారిని ఎక్కడ ఉంచాలో తెలియని అధికారులు మాఢవీధుల్లోని గ్యాలరీకి క్యూలైన్లను మళ్లించారు. దీంతో గత రాత్రి నుంచి చలిలో తాము పిల్లా పాపలతో గ్యాలరీలో కూర్చుని వేచి చూస్తూ అవస్థలు పడుతున్నామని భక్తులు వాపోయారు.
ఎంత మంది భక్తులు వస్తారన్న లెక్కలపై టీటీడీ సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, రాత్రంతా తమను గ్యాలరీల్లో కూర్చోబెట్టి తప్పు చేసిందని ఆరోపించారు. సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని, తమకు సమాధానం చెప్పేవారే కరవయ్యాయరని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు దర్శనం కావాలంటే, రేపు రాత్రి వరకూ సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.