: మోదీకి బహుమతిగా రొనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని అందించిన పోర్చుగల్ ప్రధాని
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా, దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోసం అపురూప కానుకను తెచ్చి అందించారు. ఆ దేశపు ఫుట్ బాల్ టీమ్ ధరించే జెర్సీపై స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో స్వయంగా సంతకం చేయించి తెచ్చి దాన్ని మోదీకి అందించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఫుట్ బాల్ క్రీడలో పోర్చుగల్ ఎంతో బలమైనదని, ఇండియాలో సైతం ఫుట్ బాల్ శరవేగంగా విస్తరిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్యా మరింత బలమైన క్రీడా సంబంధాలు ఉండాలన్నది తన అభిమతమని తెలిపారు. ఆ దేశ ప్రధాని కోస్టా, వారం రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో సచిన్ కు ఎంతటి పేరుందో, సమకాలీన ఫుట్ బాల్ ప్రపంచంలో రొనాల్డోకు అంతే పేరుంది. ఈ రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ గత సంవత్సరం జూలైలో జరిగిన యూరోపియన్ టైటిల్ ను తన దేశానికి అందించడంలో విజయం సాధించాడు. ఫుట్ బాల్ గ్రేటెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.