: బంధు మిత్రులకు టికెట్లు ఇవ్వబోము, అడగవద్దు: కరాఖండీగా చెప్పిన మోదీ
బీజేపీ నేతలు తమ బంధుమిత్రులకు అసెంబ్లీ టికెట్లను అడగవద్దని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేతల బంధు మిత్రులకు టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలు పేదల కోసం పని చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నదన్న విషయాన్ని, సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇండియాలో నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని, ఉగ్రవాదులకు ఎలా నిధులు రాకుండా చేశామన్న అంశాన్ని గురించి మరింతగా ప్రచారం చేయాలని చెప్పారు. రాజకీయాల్లో పారదర్శకతను మరింతగా పెంచడమే తన ఉద్దేశమని, రాజకీయ పార్టీలకు వస్తున్న నిధుల గురించిన వివరాలు బయట పెట్టే విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే, బీజేపీ ముందు నిలుస్తుందని మోదీ మరోసారి పేర్కొన్నారు.