: కళ్ల ముందు ప్రమాదం జరిగిందా? ఆసుపత్రికి తీసుకెళ్తే రూ. 2 వేలు!: ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఆఫర్
రోడ్డు మీద వెళుతుంటే, కళ్ల ముందు ఓ ప్రమాదం జరిగిందనుకోండి. మనసులో అయ్యో అనిపించినా, అక్కడి నుంచి వెళ్లిపోయే వాళ్లే ఇండియాలో అత్యధికం. పోలీసులకు ఫోన్ చేసి చెబితే, ప్రత్యక్ష సాక్షిగా నమోదు చేసి స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతారని, ప్రశ్నలతో వేధిస్తారని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల బాగోగులను అత్యధికులు పట్టించుకోరు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ఢిల్లీ ప్రభుత్వం కదిలింది. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్తే, రూ. 2 వేలను ప్రోత్సాహకంగా ఇస్తామని తెలిపింది. ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, సాయపడిన వ్యక్తికి ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాన్ని అందిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. తమ నిర్ణయంతో ప్రజల్లో చైతన్యం వస్తుందని భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.