: దేశ జనాభా పెరగడానికి ముస్లింలే కారణం.. దుమారం రేపుతున్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ముస్లింలేనంటూ కలకలం రేపారు. కులమతాల పేరుతో ఓట్లు అడగడం తప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి కొన్ని రోజులైనా గడవకముందే యూపీలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న యూపీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది. మరోవైపు సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మీరట్ కలెక్టర్‌కు ఈసీ నోటీసు జారీ చేసింది.
హిందూ జనాభా వృద్ధికి ప్రతి హిందూ మహిళ డజనుకు తగ్గకుండా పిల్లల్ని కనాలంటూ గతంలో పిలుపు నిచ్చిన ఎంపీ ఇప్పుడు ముస్లింలపై విరుచుకుపడడం వివాదాస్పదమైంది. శుక్రవారం మీరట్‌లో జరిగిన సంత్ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెరిగిపోవడానికి హిందువులు కారణం కాదని, నలుగురు భార్యలు, నలభైమంది పిల్లలు, మూడుసార్లు విడాకులు పొందేవారే దీనికి బాధ్యులని సాక్షి మహరాజ్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు ఆలోచించాలని కోరారు. కాగా సాక్షి మాట్లాడింది బీజేపీ వేదికపై కాదు కాబట్టి అతని వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు.