: నాగబాబు సార్, ఎన్నో కుటుంబాలు నా వల్ల నడుస్తున్నాయి... కానీ, నీ అన్న కారణంగానే నీ కెరీర్ నడుస్తోంది!: రాంగోపాల్ వర్మ విమర్శల వర్షం
"నాగబాబు సార్... ఎన్నో కుటుంబాలు నా కెరీర్ కారణంగా నడుస్తున్నాయి. కేవలం నీ అన్న కుటుంబం కారణంగానే నీ కెరీర్ నడుస్తోంది. నీకు కావాలంటే ఈ విషయంలో మరింత వివరంగా ట్వీట్ చేస్తాను" అని దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. శనివారం రాత్రి 10 గంటల నుంచి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాగబాబుపై విరుచుకుపడుతూ ట్వీట్ల వర్షం కురిపించాడు. అక్కుపక్షులపై మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, నీ అన్నను మచ్చిక చేసుకునే విషయంపై దృష్టిని సారించాలని, లేకుంటే రోడ్లపై పడతావని హెచ్చరించాడు.
"చిరంజీవిగారూ, అతను మీ సోదరుడని తెలుసు. మీరు అతన్ని ప్రేమిస్తున్నారనీ తెలుసు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లకు అతన్ని తీసుకురావద్దు" అని చిరంజీవికి ఓ సలహా ఇచ్చాడు. మీ గొప్పతనాన్ని, మీరు సాధించిన లక్ష్యాలను కించపరుస్తున్నారని, ఇందుకు బాధగా ఉందని చెప్పాడు. ప్రమాదం పక్కనే ఉందని, దాన్ని మీరు తెలుసుకోగలరని ఓ అభిమానిగా భావిస్తున్నానని అన్నాడు. కేవలం తమ్ముడని మాత్రమే నాగబాబును మీరు భరిస్తున్నారన్న విషయం తనకు తెలుసునని, మీరు అతనికి చేసిన దానితో పోలిస్తే, అతను మీకు చేసింది శూన్యమని అన్నాడు. చిరంజీవికి గుడ్ నైట్ చెబుతూ, నాగబాబు కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి అతని తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్టు రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు.