: ఈ ఈలలు, చప్పట్లు, కేరింతలు ఇంకా సరిపోవడం లేదు!: చిరంజీవి


అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతలు, కోలాహలం విని చాలా కాలమైందని, ఇది ఇంకా సరిపోవడం లేదని చిరంజీవి అన్నారు. హాయ్ లాండ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, అభిమానుల ఈ కోలాహలం చూసి విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నానా? లేక విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అన్న అనుమానం వస్తోందని అన్నారు. సముద్రం హోరును అభిమానుల హోరు మించిపోయిందని అన్నారు.

ఖైదీ డ్రెస్ లో ఉన్న తన స్టిల్ చూసి ఈ సినిమాకు 'ఖైదీ నెంబర్ 150' పేరు పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారని, ఆయన సూచించినట్టే ఈ సినిమాకు అదే పేరు పెట్టామని, ఈ పేరు సూచించినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అలాగే కళలను ఆదరించే టి.సుబ్బరామిరెడ్డికి, తనపై అభిమానంతో వచ్చిన కామినేని, ప్రత్తిపాటి పుల్లారావులకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. అభిమానులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే, ఉర్దూ కవి తన కవిత్వంలో ప్రేయసితో చెబుతూ 'మనిద్దరం ప్రేమలో పడి విడిపోయిన తరువాత, మళ్లీ మనం కలిసేంత వరకు ఆ మధ్యలోని కాలమేదీ గుర్తు రావడం లేదు' అన్నట్టు తన పరిస్థితి ఉందని ఆయన చెప్పారు.

2007లో 'శంకర్ దాదా జిందాబాద్' తరువాత 2017 మధ్య 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు మేకప్ వేసుకునే మధ్య సమయం క్షణంలా గడిచిపోయిందని ఆయన చెప్పారు. పదేళ్ల తరువాత కూడా పాతికేళ్ల నాటి ఉత్సాహం తనలో నింపిన శక్తి అభిమానులదేనని ఆయన అన్నారు. అదే తనను నడిపిస్తున్న శక్తి అని ఆయన చెప్పారు. ఈ సినిమా కథ కోసం అన్వేషించినప్పుడు విన్న కథలు పూర్తి ఆనందాన్నివ్వలేదని, కొన్ని కథలు బాగున్నా ఎందుకో ఆకట్టుకోలేదని అన్నారు. 'కత్తి' సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని, మంచి సందేశం ఉందని ఆయన తెలిపారు. తమిళ్ హీరో విజయ్, మురుగదాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కథ అనుకోగానే వినాయక్ ను దర్శకుడుగా పెట్టుకోవాలని అనుకున్నానని, ఆయన కూడా ఆనందంగా అంగీకరించారని చిరంజీవి తెలిపారు. నాగబాబు, కల్యాణ్ లాలా వినాయక్ కూడా తన తమ్ముడని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News