: చిరంజీవి అభిమానుల అత్యుత్సాహం.. భరించలేకపోతున్న పోలీసులు!
గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్ ల్యాండ్ లో చిరంజీవి ప్రతిష్ఠాత్మక 150వ సినిమా 'ఖైదీ నంబర్150' ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్రారంభానికి దగ్గరవుతున్న కొద్దీ మెగా అభిమానుల హడావుడిని ఆపడం పోలీసులు వల్ల కావడం లేదు. మధ్యాహ్నం నుంచే హాయ్ ల్యాండ్ కు చేరుకున్న మెగా అభిమానులు అరుపులు, కేరింతలతో పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చారు. సాయంత్రం వేడుక నిర్వహించనుండడంతో... ఏర్పాటు చేసిన లైటింగ్, సౌడ్ సిస్టమ్ స్టాండ్స్ పైకి అభిమానులు ఎక్కేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని కార్యక్రమ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో వీఐపీ, వీవీఐపీ గ్యాలరీల్లోకి చేరుకునేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. బారికేడ్లు కూడా వారిని ఆపలేకపోతున్నాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులను కూడా మెగా అభిమానులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు చేతులెత్తేశారు. వీఐపీలకు భద్రతగా బౌన్సర్లను మోహరించారు. సుమారు 300 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.