: దిండులో దాచి పారేసుకున్న డబ్బు మళ్లీ భద్రంగా ఇంటికొచ్చింది!
మతిమరపు అనేది ఒక్కోసారి కొంపల మీదకు తెస్తుంటుంది. ఇక్కడ కూడా చైనాలోని ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే... చైనాలోని షాంగ్ అనే వ్యక్తి 20 లక్షల రూపాయలు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆ డబ్బును తన దిండులో జాగ్రత్తగా పెట్టేసి, ఎవరికీ అనుమానం రాని విధంగా కుట్టేశాడు. దానిపై తలపెట్టుకుని తన వద్ద డబ్బుందన్న ఆనందంతో నిద్రపోవడం ప్రారంభించాడు. అయితే ఆయనకు వయసు పైబడింది. దీంతో దిండులో డబ్బులు పెట్టి కుట్టిన విషయం మర్చిపోయి, పాతదైపోయిందన్న కారణంగా దిండును తీసుకెళ్లి వీధి చివర ఉండే చెత్త బుట్టలో పడేశాడు. దానిని మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోయారు.
రెండు రోజుల తరువాత షాంగ్ కు తన దిండులోని 20 లక్షల రూపాయలు గుర్తుకొచ్చాయి. దీంతో ఇంటికెళ్లి దిండును చూస్తే చెత్తబుట్టలో పడేసిన విషయం గుర్తుకొచ్చింది. దీంతో లబోదిబోమంటూ స్థానిక చెత్త డంపింగ్ యార్డు సిబ్బందిని సంప్రదించాడు. అయితే వారు 15 టన్నుల చెత్తను మూడు కంటైనర్లలో ఎక్కించి రెండింటిని తరలించామని, ఇంకొకటి డంపింగ్ యార్డులో ఉందని, వెతుక్కోవాలని సూచించారు. ఈ విషయంలో అతనికి కార్మికులు సాయం చేశారు. దీంతో వారంతా కలిసి ఆ కంటైనర్ ను జల్లెడపట్టారు. దీంతో అతని అదృష్టం బాగుండి దిండు దొరికింది. దిండులో 20 లక్షల డబ్బు కూడా దొరికింది. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనతోపాటు కంటైనర్ వెతికిన కార్మికులకు షాంగ్ డబ్బులిచ్చే ప్రయత్నం చేయగా, తమ డ్యూటీ తాము చేశామంటూ వారు ఆయన డబ్బును తిరస్కరించడం విశేషం.