: మళ్లీ పెళ్లి చేసుకున్నావంటూ ఆరు నెలల నుంచి పింఛను ఆపేశారు.. కన్నీరు పెట్టుకుంటున్న మహిళ!
బహదూర్‌పురా మండలం పురానాపూల్‌కు చెందిన రమాదేవి అనే మహిళ తనకు రావాల్సిన పింఛన్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదు. అంతేగాక చేదు అనుభవాలను ఎదుర్కుంటోంది. ఆమె భర్త ప్రేమ్‌కుమార్ 2005, సెప్టెంబర్ 1న మృతి చెందాడు. కూతురు, కుమారుడిని ఆమే పోషిస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పింఛను డబ్బులు ఆరు నెలల నుంచి రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఆమె మళ్లీ వివాహం చేసుకుందని రికార్డులో తప్పుగా నమోదు చేశారు. పదేళ్ల నుంచి నెలకు రూ.200 పింఛన్ తీసుకుంటున్న ఆమె.. తెలంగాణ సర్కారు పింఛను పెంచిన అనంతరం గత ఏడాది జూన్ వరకు రూ.1000 తీసుకుంది. అయితే, గత ఏడాది జులై నుంచి అధికారులు ఆమెకు పింఛను నిలిపివేశారు.
బహదూర్‌పురా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆమె చెప్పులు అరిగిపోయేలా తిరుగుతోంది. అయినా అధికారులు ఆమె కష్టాలను పట్టించుకోవడం లేదు. ఆమెను భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకురావాలని, వేలి ముద్రలు వేయలేదని.. ఇలా పలు కారణాలు చెబుతూ మళ్లీ ఇంటికి పంపించేస్తున్నారు. దీంతో విసుగెత్తిపోయిన ఆమె కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అధికారులు ఆమె రికార్డులను పరిశీలించి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు అందులో ఉందని చెప్పారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. దీనిపై విచారణ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అనంతరం పెళ్లి చేసుకోలేదని విచారణలో తేలింది. అయినప్పటికీ అధికారులు ఆమెకు పింఛను డబ్బులను ఇవ్వడం లేదు. అధికారుల చేసిన తప్పుకు ఆరు నెలల పింఛన్‌ను ఆమె అందుకోలేదు. తన పింఛను తనకు ఇప్పించాలని కన్నీరు పెట్టుకుంటూ ఆమె కోరుతోంది.