eeshwarappa: కర్ణాటక తదుపరి సీఎం ఈశ్వరప్పేనంటూ కరపత్రాలు!
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఓ వైపు కర్ణాటక తదుపరి సీఎం తానే అంటూ బీజేపీ నేత యడ్యూరప్ప ఉద్ఘాటిస్తోంటే మరోవైపు అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఈశ్వరప్ప వర్గీయులు కూడా తమ నాయకుడే తదుపరి సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ వారు కరపత్రాల్ని కూడా పంచి పెడుతుండడం బీజేపీ అధిష్ఠానానికి చిక్కులు తెచ్చి పెడుతోంది.
హాసన్ జిల్లాలోని అరసికెరె పట్టణంలో రాయణ్ణ బ్రిగేడ్ పేరుతో ఈ కరపత్రాల్ని ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఈశ్వరప్ప స్పందిస్తూ ఆ కరపత్రాల గురించి తనకు ఏం తెలియదని అన్నారు. రాయణ్ణ బ్రిగేడ్‌ను రద్దు చేయాలని ఇటీవలే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరరావు ఈశ్వరప్పను హెచ్చరించారు. అయినప్పటికీ ఈశ్వరప్ప బ్రిగేడ్ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు.