: లండన్ ఎంత దారుణమైన నగరమో తెలుసా? అంటున్న భారత సంతతి వ్యక్తి!
లండన్ చాలా ప్రమాదకరమైన నగరమని, ఎంతో వివక్ష చూపిస్తుంటారని భారత సంతతి వైద్యుడు, అంధుడైన అమిత్ పటేల్ చెబుతున్నారు. అమిత్ పటేల్ గతంలో వైద్యుడిగా పని చేశారు. అయితే ఐదేళ్ల క్రితం కెరటోకానస్ అనే కంటి వ్యాధి కారణంగా ఆయన చూపు కోల్పోయారు. దీంతో తన పెంపుడు కుక్క సాయంతో లండన్ వీధుల్లో తిరుగుతుంటారు. దాని పేరు కైకా. కళ్లు లేని తన పట్ల అక్కడ ఎంత వివక్ష చూపిస్తున్నారో తనకు మాత్రమే తెలుసంటారాయన, అయితే, వివక్ష విషయం ఎవరికైనా చెబితే సాక్ష్యం అడుగుతారు. అందుకే ఆయన కైకాకి కెమెరా కట్టి తన పట్ల చూపించే వివక్ష మొత్తాన్ని షూట్ చేశారు. ఆయన కైకాకి అమర్చిన గోప్రో కెమెరా లండన్ వాసులు చూపే వివక్షను షూట్ చేసింది. ఈ సందర్భంగా ఆయన తన ఆవేదన వెల్లడిస్తూ, లండన్ చాలా ప్రమాదకరమైన నగరమని అంటున్నారు.
ఇక్కడ ఎవరో ఒకళ్లు తనను ట్రఫాల్గర్ స్క్వేర్ మధ్యలో నిలబెట్టి, ఒక సర్కిల్ గా తిప్పి, 'నీ ఇల్లు ఎక్కడో కనుక్కో' అంటారని ఆయన అన్నారు. తన కుక్క కైకాను కూడా బ్యాగులతో కొడుతుంటారని ఆయన తెలిపారు. ఒకరోజు ఓ మహిళ తనను ఆపి, తనే తనను పట్టుకుని, నలుగురినీ పిలిచి తనను క్షమాపణలు అడిగిందని గుర్తు చేసుకున్నారు. ఆమె అలా ఎందుకు అడిగారో అర్థం కాక తాను షాకయ్యానని ఆయన తెలిపారు. తనపై చూపిన వివక్షను తన పెంపుడు కుక్కకు అమర్చిన గోప్రో కెమెరా సాయంతో షూట్ చేసి తన భార్యకు చూపించారు. దీనిని చూసిన అతని భార్య సీమా, ఫుటేజి సాక్ష్యంతో లండన్ లోని నెట్ వర్క్ రైల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దాంతో సదరు రైల్వే సంస్థ కూడా స్పందించి, అలాంటి వ్యక్తులతో ఎలా మసలు కోవాలో తన సిబ్బందికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది.