: మరణం విషయంలో ఓంపురి ఏం కోరుకున్నారో అదే జరిగింది!


బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఓంపురి (66) ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కోరుకున్నట్టే ఆయన మరణం సంభవించడం కాకతాళీయమే అయినా, ఆయన కోరుకున్నట్టే ఆయనను మృత్యువు దరిచేరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు తన మరణం గురించి ఆయన ఏమన్నారో తెలిపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 2015 లో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చావంటే భయం లేదు కానీ అనారోగ్యానికి గురికావడమంటే మాత్రం చాలా భయమని అన్నారు.

 ఆరోగ్యం పాడై, మంచాన పడి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పక్కవారిపై ఆధారపడే వారిని చూసినప్పుడల్లా తనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనన్న భయం వుందని, కానీ చావంటే మాత్రం భయం లేదని ఆయన తెలిపారు. అంతే కాకుండా, 'చావును కూడా ఎవరూ ముందే వూహించలేరు. ఎప్పుడో ఒకప్పుడు నిద్రలో కన్నుమూస్తాం. నిన్న రాత్రి 7.22 నిమిషాలకు ఫలానా ఆయన కన్నుమూశారు.. అన్న వార్త ఉదయం ప్రజలకు తెలుస్తుంది' అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ ఉదయం లేచేసరికి, 'నిద్దట్లో గుండెపోటుతో కన్నుమూసిన ఓంపురి' అన్న వార్తను దేశ ప్రజలు విన్నారు. ఆయన కోరుకున్నట్టే ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మృత్యువు ఒడిలోకి ఆయన జారుకున్నారు!  

  • Loading...

More Telugu News