: అంతర్జాతీయ మోసగాడి ఇంట్లో కోట్లలో నల్లధనం... అవాక్కయిన అధికారులు!
ఓ అంతర్జాతీయ మోసగాడి ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన అమెరికా అధికారులు అక్కడ దాచిన డబ్బును చూసి ఆశ్చర్యపోయారు. ఆ నల్లధనాన్ని దాచింది ఏ బీరువాలోనో, సూట్ కేసుల్లోనో కాదు.. ఇంట్లో ఉన్న ఒక పరుపులో! బ్రెజిల్ కు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల క్లెబర్ రెనె రిజేరియో రోచా అనే వ్యక్తి, ‘టెలెక్స్ ఫ్రీ ఇన్ కార్పొరేట్’ అనే ఆన్ లైన్ టెలికాం కంపెనీ పేరుతో అంతర్జాతీయ మోసాలకు, మనీ లాండరిండ్ కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.
పలు దేశాలకు చెందిన లక్షల మందిని మోసం చేసినట్టు, వంద కోట్ల డాలర్ల మోసాలకు పాల్పడినట్లుగా సదరు సంస్థపై 2014లో కేసులు నమోదు చేశారు. కొందరు నిర్వాహకులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు కూడా. తాజాగా, రిజేరియాను కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ నిమిత్తం మసాచుసెట్స్ లోని రిజేరియో ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పరుపులో దాచిపెట్టిన డాలర్ల కట్టలు ఈ సోదాల్లో బయటపడ్డాయి. రెండు కోట్ల డాలర్ల విలువైన నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.