: ఎస్పీలో రెండు వర్గాల సయోధ్యకు మళ్లీ మంతనాలు!
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతున్న తరుణంలో తండ్రీ కొడుకుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ నివాసానికి వెళ్లి ఈరోజు చర్చలు జరిపారు. అదేసమయంలో, ములాయంతో పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ సమావేశమయ్యారు. ములాయం, అఖిలేశ్ వర్గాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
అయితే, నిన్న రాత్రి కూడా ములాయం ఇంట్లో అఖిలేశ్, అమర్ సింగ్, శివపాల్ యాదవ్ లు సమాలోచనలు చేశారు. సీఎం అఖిలేశ్ కు, పార్టీకి తాను ఎలా సాయపడిందీ అమర్ సింగ్ గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అమర్ సింగ్ ను పార్టీ నుంచి పక్కన పెడితే గానీ సయోధ్య కుదరదని అఖిలేశ్ తెగేసి చెప్పారట. అఖిలేశ్, శివపాల్ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో ఇరువర్గాలు సమావేశం కావడం ఆసక్తి కల్గిస్తోంది.