: బ్యాంకులో రూ.2 వేల నకిలీనోటు కలకలం
దేశంలో పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు, వ్యాపారులకు నకిలీనోట్ల రూపంలో మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. కోల్‌కతా నగరంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో రూ.2 వేల నకిలీనోటు కనిపించింది. భవానీపూర్ కు చెందిన మెడీ క్లూ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ యాజమాన్యం సదరు బ్యాంకులో రూ.యాభైవేల రూపాయలను ఇటీవలే జమచేసింది. అయితే, అందులో రూ.2 వేల నకిలీ నోటును గుర్తించి, ఈ విషయాన్ని ల్యాబ్ యజమాని చక్రబర్తికి చెప్పారు. అనంతరం ఆయన నకిలీనోటని ఆ నోటును స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు అందజేశారు.
తమ బ్యాంకుకు ఈ నోటు రావడంపై ముంబయిలోని కేంద్ర కార్యాలయానికి తాము ఈ సమాచారం అందించామని బ్యాంకు మేనేజరు అర్నబ్ బోస్ మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముర్షిదాబాద్, మాల్దాల నుంచి ఈ నోట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నకిలీ నోటు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ నకిలీ నోటును పరిశీలించాలని తాము రిజర్వు బ్యాంకును కూడా కోరామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.