: నన్నెవరూ ఆపలేరు... రాజకీయాల్లోకి వస్తున్నా: జయలలిత మేనకోడలు దీప
తాను రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమని, తన రాజకీయ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప స్పష్టం చేశారు. దీపను కలిసేందుకు తంజావూరు, మదురై, ఈరోడ్, తిరుచ్చి తదితర 14 జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆమె ఇంటికి వచ్చి, రాజకీయాల్లోకి రావాలని, జయలలిత గౌరవాన్ని కాపాడాలని నినాదాలు చేయగా, వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
త్వరలోనే ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తానని, సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు. కాగా, జయలలితకు అసలైన వారసులు మీరేనని చెప్పి వెళుతున్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్నారు. ఎవరెవరు వచ్చి పోతున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ రిజిస్టర్ ను కూడా ఏర్పాటు చేసి, వచ్చిన వారితో సంతకం చేయిస్తున్నారు.