: ఏటీఎంలో రూ.500 నోట్లు ఉన్నాయి కదా అని పదేపదే తీశారో.. మోత మోగుద్ది!
పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రెండు నెలల పాటు ఏటీఎం నుంచి కాస్తో కూస్తో వచ్చిన నోట్లు ఏవైనా ఉన్నాయంటే అవి రూ.2 వేల నోట్లు మాత్రమే. దీనికి తోడు ఏటీఎంలో డెబిట్ కార్డు వినియోగంపై ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఎన్నిసార్లు ఏటీఎంకు వెళ్లినా సమస్య లేకుండా పోయింది. ప్రస్తుతం నోట్ల సమస్య కొద్దికొద్దిగా సద్దుమణుగుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆశగా వాటినే తీసుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల మేరకు తీసుకోవాల్సిన సొమ్మును పలు దఫాలుగా తీసుకుంటున్నారు. ఒకేసారి తీస్తే రూ.4500కు రెండు రూ.2 వేల నోట్లు, ఒక రూ.500 నోట్లు వస్తుండడమే కారణం.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా రోజూ ఇలానే తీయడం వల్ల ఏటీఎంలో డెబిట్ కార్డు వినియోగ పరిమితి మించిపోయి సర్వీస్ చార్జీల పేరుతో ఖాతాదారులకు చుక్కలు చూపించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.20-25 వడ్డించేందుకు సిద్ధమయ్యాయి. మెట్రో నగరాల్లో మూడుసార్లు, నాన్-మెట్రో నగరాల్లో ఐదు సార్లు మాత్రమే ఏటీఎం కార్డు ఉపయోగించే నిబంధనను బ్యాంకులు మళ్లీ తెరపైకి తేవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులేమో ఈ విషయంలో తామేమీ చేయలేమని, ఆర్బీఐ నుంచి తమకు ఎటువంటి మార్గదర్శకాలు అందకపోవడం వల్లే ఈ నిబంధనను తిరిగి యథాతథంగా అమలు చేస్తున్నామని చెబుతున్నాయి. సో.. వినియోగదారులారా జర భద్రం! రూ.500 నోట్లను చూసి ఆవేశపడకండి!