: అభివృద్ధిని అడ్డుకునే వైసీపీని వచ్చే ఎన్నికల్లో జీరో చేయండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో జీరో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శివారులోని సామర్లకోట రోడ్డులో వైభవ్ వెంచర్స్ ఆవరణలో గురువారం రూ.1,630 కోట్లతో చేపడుతున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేసేందుకు సహకరిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రజల సమక్షంలో హామీ తీసుకున్నారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లిస్తామని మరోమారు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు, తుపాకులకే తాను భయపడలేదని, ఇక వీరెంత? అని ఆయన అన్నారు. ప్రగతిని అడుగడుగునా అడ్డుకునే వైసీపీని వచ్చే ఎన్నికల్లో జీరో చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పట్లో కమీషన్ల కోసం కాలువ పనులు చేపట్టి డబ్బులు చేతికి రాగానే వాటిని పక్కన పడేశారని విమర్శించారు. పట్టిసీమకు కూడా వైసీపీ సహా ప్రతిపక్షాలు అన్నీ మూకుమ్మడిగా అడ్డంకులు కల్పించినా పూర్తిచేశామని చంద్రబాబు పేర్కొన్నారు.