: ప్రశంసలు కాదు...పైసలు కావాలి: మోదీకి బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ
తమకు ప్రసంశలు కాదు, పైసలు కావాలంటూ బ్యాంకు ఉద్యోగులు ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నారు. నూతన సంవత్సరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ, బ్యాంకు ఉద్యోగుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, కష్టపడి పని చేశారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ప్రశంసలతో సరిపెట్టకుండా పైసలివ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఓవర్ టైమ్ డ్యూస్ తక్షణమే చెల్లించాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎన్‌ఓబీడబ్ల్యూ) డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (ఎన్ఎంఎస్) అనుబంధంగా ఉన్న ఎన్‌ఓబీడబ్ల్యూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. అందులో చాలా బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇంకా ఓవర్ టైమ్ డ్యూస్ చెల్లించలేదని పేర్కొంది. ‘బ్యాంకు ఉద్యోగులు బాగా పని చేశారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు కానీ, ఉద్యోగుల సంక్షేమానికి కచ్చితమైన ప్రకటన చేయలేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఉద్యోగుల భద్రతకు తగు చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరినట్టు ఆ సంఘం వెల్లడించింది.