: సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతాం: కేసీఆర్
సింగరేణిని బతికించుకోవాలంటే ఓపెన్ కాస్ట్ కూడా ఉండాలని, కొత్తగా 11 భూగర్భ గనులను ప్రారంభిస్తామని, సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో సింగరేణి అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిపెండెంట్ ఉద్యోగాల కోసం వయో పరిమితిని నలభై ఏళ్లకు పెంచుతామని అన్నారు. సమైక్య పాలనలో పాలకుల వల్ల చాలా నష్టం జరిగిందని, సింగరేణి సంస్థను ధ్వంసం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని, ఆ పరిస్థితులన్నీ సరిదిద్దుతామని అన్నారు. గతంలో సింగరేణి కార్మికులు చనిపోతే లక్షరూపాయలు కూడా ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.48 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు. రామగుండం ఎఫ్ సీఐ కూడా కనపడకుండా పోయిందని, ప్రధాని మోదీని కోరితే తిరిగి తెరిపిస్తామని మాట ఇచ్చారని కేసీఆర్ చెప్పారు.