: హైదరాబాదీకి సౌదీలో 300 కొరడా దెబ్బలు!
హైదరాబాద్ లోని మలక్ పేట్ కు చెందిన ఎంబీయే పట్టభద్రుడు మహ్మద్ మన్సూర్ హుస్సేన్ కు సౌదీ అరేబియా న్యాయస్థానం ఏడాది జైలుశిక్షతో పాటు 300 కొరడా దెబ్బలు కూడా విధించింది. దీనిపై అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ కేసులో తమ కుమారుడ్ని అరెస్టు చేసి అరేబియాలోని వదీ అల్ దవాసిర్ జైల్లో పెట్టారని, అతను నిర్దోషి అని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను సాయం కోరారు. కాగా, హైదరాబాదీ అయిన మహ్మద్ మన్సూర్ హుస్సేన్ 2013లో రియాద్ వెళ్లాడు. ఎంబీయే పట్టభద్రుడైన హుస్సేన్ అక్కడి మార్కెటింగ్ ఆడిటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
గత ఆగస్టు 25న 1.06 లక్షల సౌదీ రియాళ్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు తుపాకి చూపి బెదిరించి అతడిని దోచుకున్నారని హుస్సేన్ తల్లిదండ్రులు చెప్పారు. అతని నుంచి నగదు తీసుకుని, నంబరు ప్లేటు లేని కారులో పారిపోయారని చెప్పారు. ఈ విషయం తాను పనిచేస్తున్న సంస్థ యజమానికి తెలుపగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారని, ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్తే హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతని తల్లి హూరున్నీసా తెలిపారు.
తమ కుమారుడు సంస్థ ఖాతాలో 15 లక్షల సౌదీ రియాళ్లు జమచేశాడని, 1.06 లక్షల సౌదీరియాళ్లకి కక్కుర్తి పడే అవకాశం లేదని ఆమె సుష్మా స్వరాజ్ కు వివరించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కల్పించుకుని, సుష్మాకు సిఫారసు చేయాలని ఆమె కోరారు. తన కుమారుడు నిర్దోషి అని, అతనిని రక్షించాలని ఆమె కోరుతున్నారు. అయితే హుస్సేన్ కు వీలైనంత సాయం చేస్తామని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.