: ధోనీ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా?
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి రాజీనామా చేయడాన్ని అతని ముందుచూపుగా క్రీడావిశ్లేషకులు పేర్కొంటున్నారు. ధోనీ పగ్గాలు చేపట్టేనాటికి టీమిండియా ప్రదర్శన అంత అద్భుతంగా లేదు. టీమిండియాకు విజయవంతమైన కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిష్క్రమణ అనంతరం టీమిండియా ప్రదర్శన దిగజారిపోయింది. సచిన్ పెద్దగా ఆకట్టుకోలేదు. కుంబ్లే సమయంలో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ద్రవిడ్ కెప్టెన్సీ చేపట్టేనాటికి జట్టులో రాణించే ఏకైక్ ఆటగాడు ద్రవిడ్ ఒక్కడే కావడం విశేషం. దీంతో అప్పట్లో ద్రవిడ్ మాత్రమే బ్యాటుతో రాణించాడు. దీంతో జట్టు ఓటమిపాలైంది. ఈ దశలో అప్పటి బీసీసీఐలో ముంబై క్రికెట్ కమిటీ హవా నడిచేది. బీసీసీఐ అధ్యక్షుడు కూడా శరద్ పవార్ కావడంతో ముంబై వెటరన్ లు ఆడిందే ఆటగా సాగింది. దీంతో గంగూలీ సహా, కుంబ్లే, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి వారి రిటైర్మెంట్ సమయంలో ఊహించని అవమానాలు ఎదుర్కొన్నారు.
ప్రత్యేకంగా ఎవరూ వారిని అవమానించనప్పటికీ వారికి దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేదు. దీని వెనుక మరాఠా క్రికెట్ రాజకీయ నాయకుల హస్తముందని, వారి మద్దతుదారుగా జట్టులో సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, హర్బజన్ వంటి సీనియర్లున్నప్పటికీ, అనూహ్యంగా ధోనీ అందలాలు ఎక్కాడనీ వార్తలొచ్చాయి. దీంతో అంతవరకు కేవలం కీపర్ గా ఉన్న ధోనీలో అసాధారణ కెప్టెన్సీ లక్షణాలు బయటపడ్డాయి. జట్టు వరుస విజయాల బాటపట్టింది. ఆ తర్వాత పరిస్థితులలో అనూహ్యంగా దూసుకొచ్చిన కోహ్లీకి మద్దతు పెరిగింది. ఒకప్పుడు ధోనీ వెంట మరాఠా, జార్ఖాండ్, బీహార్, యూపీ క్రికెట్ బోర్డులు ఉండగా, కోహ్లీ వెంట ఢిల్లీ, ముంబై వంటి బోర్డుల మద్దతు ఉంది.
ఇదే సమయంలో మ్యాచ్ ఫినిషర్ అనిపించుకున్న ధోనీ పేలవ ప్రదర్శన అతనిని వెనక్కి నెట్టేసింది. జట్టులో ఆటగాళ్లు విఫలమవుతుండడంతో ధోనీ అసాధారణ కెప్టెన్సీ ఒక్కసారిగా సాధారణంగా మారిపోయింది. ఆటలో మెరుపులు మెరిపించాల్సిన ధోనీ మీడియా సమావేశాల్లో మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో కోహ్లీ నిలకడగా ఆడడం ప్రారంభించి, కెప్టెన్ గా ఎందిగాడు. తాను ఫాంలో ఉండగా, మాటమాత్రమైనా చెప్పకుండా కోహ్లీని హఠాత్తుగా కెప్టెన్ ను చేయడంతో అలిగిన ధోనీ ఏకంగా టెస్టు క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఈ ఒక్క నిర్ణయం అతని కెరీర్ కి భారంగా మారింది.
టెస్టు కెప్టెన్ గా ధోనీ కొనసాగి ఉంటే కొత్త ఆటగాళ్లకు బదులుగా ధోనీ కోటరీ మాత్రమే స్థానం సంపాదించి ఉండేది. దీంతో జట్టు ప్రదర్శన కూడా కుంటుబడి ఉండేది. టెస్టుల నుంచి తప్పుకున్న ధోనీతో కంటే, టెస్టు జట్టులో ఐదు రోజుల పాటు మైదానంలో కలిసి ఉండే కోహ్లీని ఆటగాళ్లు ఇష్టపడడం మొదలు పెట్టారు. దీంతో ధోనీ నెమ్మదిగా తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ దశలో బీసీసీఐలో ముంబైకర్ల హవా కొనసాగి ఉంటే ధోనీ స్థానానికి వచ్చిన ఢోకా వుండేది కాదు.
లోథా సిఫారసులతో గంగూలీ వంటి వారిని బీసీసీఐ చీఫ్ గా చేయకతప్పని పరిస్థితి నెలకొనడంతో అవమానాలు ఎదుర్కొనే కంటే ముందుగానే తప్పుకోవడం మేలని ధోనీ భావించాడు. ఇప్పుడు తప్పుకోవడం కారణంగా బీసీసీఐలో కొత్త అవకాశాలు వెతుక్కోవాలన్న లక్ష్యం కూడా ధోనీకి ఉండడంతో ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.