: న్యూ ఇయర్ రోజున బెంగళూరులోనే కాదు.. ఢిల్లీలోనూ రెచ్చిపోయి దాడిచేసిన 250 మంది యువకులు
న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులో అర్ధరాత్రి యువతులపై పలువురు యువకులు దాడికి దిగి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం పుణె సమీపంలోని శివాజీ కోటలో ట్రెక్కింగ్ కు వెళ్లిన యువతులపై మరో దాడి ఘటన కూడా వెలుగులోకొచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఇటువంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకొచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సుమారు 250 మంది విద్యార్థులు ఒకే చోటకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తితో కలసి ఓ మహిళ బైకుపై వెళుతూ వారికి కనిపించింది. ఆ బైకును ఆపిన యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వికృత చేష్టలు చేశారు.
బైకుపై నుంచి ఆమెను యువకులు లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టింది. దీనిని గమనించిన అక్కడి పోలీసులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా ఆ యువకులు దాడికి దిగి, రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అక్కడ పార్క్ చేసిన పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో అక్కడికి అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ యువకులు పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.