: సరదాగా ప్రేయసిని ఆటపట్టిస్తూ, ఆమె ముందే మరణించిన ప్రియుడు!
"నీతోనే నా జీవితం... నువ్వు లేకుండా నేను బతకలేను" అని చెబుతూ, ప్రేయసిని నమ్మించలేకపోయిన ఓ ప్రియుడి జీవితం బెడిసికొట్టి, అతని ప్రాణాలనే తీసిన ఘటన ఇది. ముంబైలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, కశ్మీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని, మీరా రోడ్ లో నివాసం ఉంటూ, ఎంబీఏ చదువుతున్న సన్మిత్ రాణే అనే యువకుడు, ఆ ప్రాంతంలోనే ఉండే అమ్మాయిని ప్రేమించాడు. వీరి వ్యవహారం రెండు కుటుంబాలకూ తెలుసు. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకున్న వేళ, వారి మధ్య మాటల్లో, 'నువ్వు లేకపోతే నేను లేను' అంటూ అతను తమ ప్రియురాలికి చెప్పాడు.
ఆమె నుంచి వెంటనే సమాధారం రాకపోవడంతో, 'చావనైనా చస్తాను కానీ నిన్ను విడిచి ఉండలే'నని చెబుతూ, ఉరి వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఏర్పాట్లు చేసుకుని, సీలింగ్ కు తాడు బిగించి, కుర్చీపై నిలబడి, ప్రేయసిని ఆట పట్టించాలని చూశాడు. ప్రమాదవశాత్తూ అతడి కాళ్ల కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో, ఉరి బిగించుకుని కేకలు పెట్టాడు. దీన్ని చూసిన ప్రేయసి, తొలుత కావాలనే అరుస్తున్నాడని భావించి, ఆపై దిగ్భ్రాంతికి గురై, ఇరుగు పొరుగును పిలిచేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రాణేను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు.