kcr: సభలో నిన్న జరిగిన దానికి నేను కూడా బాధపడుతున్నాను: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఫీజు రీయింబర్స్ మెంటుపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఫీజు రీయింబర్స్మెంటుపై చర్చచేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బోధనా రుసుముల బకాయిలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. నిన్న సభలో సీఎం ప్రసంగం తరువాత తాము అడగాలనుకున్న ప్రశ్నలు అడగకముందే సభను వాయిదా వేశారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విపక్షాలు ఓపిగ్గా విన్నాయని, అయితే, ఆయన ప్రసంగం తరువాత విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సభ జరిగేందుకు తమ వంతు తాము సహకరిస్తున్నాని అన్నారు. నిన్న సభలో జరిగింది సవ్యంగా లేదని చెప్పారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సభలో తాము ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదని అనడం సరికాదని అన్నారు. అందరం కలిసి అసెంబ్లీ సంప్రదాయాలను కాపాడుకుందామని చెప్పారు. విపక్షాలు మాట్లాడుతున్నప్పుడు తాము అడ్డుకోవడం లేదని, అయితే సభలో నిన్న జరిగిన దానికి తాను కూడా బాధపడుతున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడేందుకు తాము అధికంగానే సమయం కేటాయిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు తాము సమాధానం చెబుతామని అన్నారు. ప్రజల సమస్యలే చర్చించాలనుకుంటే తాము రెడీ అని అన్నారు. సభలో ప్రశ్నోత్తరాల అనంతరం ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చిద్దామని చెప్పారు. తాము భేషజాలకు వెళ్లడం లేదని అన్నారు.