: ధోనీ కెరీర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా?
భారత క్రికెట్ వన్డే, టీ-20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ధోనీ క్రికెట్ కెరీర్ కు ఇక కౌంట్ డౌన్ మొదలైపోయిందని క్రీడా పండితులు భావిస్తున్నారు. త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ ధోనీ కెరీర్ కు అత్యంత కీలకం కానుందని తెలుస్తోంది. మొత్తం ఆరు మ్యాచ్ లు జరగనుండగా, ధోనీ ఎలా రాణిస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భారత జట్టులోకి నైపుణ్యవంతులైన యువ ఆటగాళ్లు వస్తుండటంతో వారికి చోటివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్, ఈషాన్ కిషన్ వంటి వికెట్ కీపర్లూ జట్టుకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
మరో రెండున్నరేళ్లలో వరల్డ్ కప్ కు సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితుల్లో, గతంలోలా ధోనీ మ్యాచ్ లను ముగించలేకపోతున్నాడన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాను మ్యాచ్ లకు సరైన ముగింపు ఇవ్వలేక పోతున్నానని స్వయంగా ధోనీ అంగీకరించాడు కూడా. ఇక కొత్త నీరు రావాలంటే, పాత నీరు బయటకు వెళ్లాల్సిందేనన్నట్టు, ధోనీ ఈ సంవత్సరంలోనే క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రికెట్ పండితులు వ్యాఖ్యానించారు.